ఒకరు అత్యాచార బాధితురాలు..మరొకరు అత్యాచార బాధితులకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్. ఇద్దరిది వేర్వేరు దేశాలైనా వారు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. వారెవరో కాదు ఇరాక్‌కు చెందిన మురాద్ నదియా(25),కాంగోకు చెందిన మక్వీజ్.ప్రస్తుతం ఇప్పుడు వీరిపేర్లే నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారాయి.
మురాక్ నదియా…ఇరాక్‌లో యజీదీ వర్గానికి చెందిన మహిళా. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు(ఐఎస్ ఉగ్రవాదులు) మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు,చిన్నారులను నిర్భందించి లైంగిక బానిసలుగా చేర్చుకున్నారు. వీరిలో ఒకరు నదియా.
మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా..2014 నవంబర్‌లో ఐఎస్ చెర నుంచి అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఏమాత్రం కుంగిపోలేదు. తనలాగా మరెవరూ ఐఎస్ చెరలో మగ్గిపోకుండా యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి చాటిచెప్పాలనుకుంది. అలుపెరగని
పోరాటం చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై గళం విప్పింది. నదియా పోరాట ఫలితంగా నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్ నరకకూపం నుంచి విముక్తి లభించింది.
యాజిదీల హృదయవిదార పరిస్థితిపై ‘ద లాస్ట్ గర్ల్’ అనే పుస్తకాన్ని రాసింది. ఐఎస్ చెరలో తాను ఎదుర్కొన్న దుర్బర జీవితం గురించి వివరించింది. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారని… వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారని వివరించింది. చిన్న పిల్లలను కూడా వదిలేవారు కారని…పుసగుచ్చినట్లు ఐఎస్ ఉగ్రవాదుల దాష్టికాన్ని వివరించింది. ఆమె చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది.
డాక్టర్ మక్వీజ్. కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్‌ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు రోజుకు 18 గంటల పాటు శ్రమించారు.
అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఆయన తన సేవాతప్పరతను మాత్రం విడిచిపెట్టలేదు. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. నోబెల్ శాంతి బహుమతికి డాక్టర్ మక్వీజ్ ఆరుసార్లు
నామినేట్ కావడం విశేషం.