గడువుకు ముందే మిషన్ భగీరథను పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.నగర శివారు ప్రాంతాల్లో మంచినీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ రూ.1900 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్ పరిధిలో దశల వారీగా పనులను చేపడుతున్నామని చెప్పారు.హైదరాబాద్ నగరానికి కృష్ణ,గోదావరి నదుల్లో రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయిన రెండు డెడికేటెడ్ రిజర్వాయర్ల ద్వారా మంచినీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు అభినందిస్తున్నారని చెప్పారు.
అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులో కొన్ని కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని వాటిని త్వరలోనే సరిదిద్దుకుంటామని చెప్పారు.ఇప్పటివరకు మంచినీరు అందని ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి పైపులైన్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.. కొన్నిప్రాంతాల్లో పదిరోజులకోసారి నీళ్లు వస్తున్నాయని సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.మిషన్ భగీరథకు కేంద్రప్రభుత్వం సాయం అందించాలని కోరినా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ సభ్యులు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం అందించడం విషయంలో దృష్టిపెడితే బాగుంటుందన్నారు. ఈ ఎండాకాలంలో మంచినీటి కొరత ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.