మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో శరవేగంగా తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని చెర్రీ మార్చుకున్నాడట. దానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణే.
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో… పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమాను సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఈ సినిమా జవసత్వాలను అందిస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చక్కటి ఔట్ పుట్ తో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసేలా చూడాలని త్రివిక్రమ్ కు పవన్ సూచించారట.
ఈ నేపథ్యంలో బాబాయ్‌తో పోటీ పడటం ఇష్టం లేని చెర్రీ సంక్రాంతి కంటే ముందుగానే వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సుకుమార్ కూడా… చరణ్ మాటకు కాదనలేకపోతున్నాడని, అందుకే షూటింగ్ కాస్త స్పీడప్ చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇక పవన్ అభిమానుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి చరణ్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. పవన్ బాబాయ్ అమ్మతో సమానం.. అనే అర్థం వచ్చేలా మాట్లాడి పవన్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేసిన చరణ్…. ఇప్పుడు పవన్ కోసం రిలీజ్ డేటే మార్చుకోవడానికి సిద్దమయ్యాడట.