ఇష్టం లేకపోతే… చూడటం మానేయండి

246
No Mersal Ban Says Madras High Court
- Advertisement -

తమిళనాట సంచలనం సృష్టించిన సినిమా మెర్సల్. ఈ సినిమాలో డైలాగులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెర్సల్ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మెర్సల్ అనేది కేవలం ఓ సినిమా మాత్రమే కానీ అదేమీ నిజ జీవితం కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగానే వర్తిస్తుంది అని తెలిపిన న్యాయస్ధానం ఇష్టంలేకపోతే సినిమా చూడటం మానేయాలని సూచించింది.

ఇదో ఊహాత్మక చిత్రమే తప్పించి ప్రత్యేకంగా ఎవరినో ఉద్దేశించి తీసిన రియల్ లైఫ్ చిత్రం కాదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సినిమాల్లో ధూమపానం, తాగుడు గురించి ఎందుకు ఫిర్యాదు చేయరని ప్రశ్నించింది. అలాగే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ విషయాలపై మౌనంగా ఎందుకు ఉంటారని నిలదీసింది.

దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం లేదు. మాకు ఆసుపత్రులు కావాలి  అంటూ సినిమాలో చెప్పే డైలాగుపై మధురైకి చెందిన న్యాయవాది కోర్టుకెక్కారు. ఈ డైలాగు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు.  ఈ నేపథ్యంలో న్యాయస్ధానం పిటిషనర్‌కి మొట్టికాయలు పెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో అదిరింది పేరిట వస్తోన్న ఈ సినిమా విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తమిళనాట వివాదాలకి కారణమైన పలు డైలాగ్స్, సన్నివేశాలని తెలుగు వెర్షన్‌లో తొలగించినప్పటికీ.. ప్రస్తుతానికి ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా ఓ క్లారిటీ అయితే రాలేదు. దాదాపు 700 థియేటర్లలో రిలీజ్ కావాల్సి వున్న ఈ సినిమా కోసం తెలుగు బయ్యర్స్ వేచిచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టిన తమిళ వెర్షన్ అక్కడి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.

- Advertisement -