జీఎస్టీతో రాష్ట్రానికి న‌ష్ట‌ం లేదు…

196
No loss for GST in Telangana
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ (వస్తు సేవల పన్ను) పై ప్రజలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రగతి భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జీఎస్టీ ప‌న్ను వ‌ల్ల రాష్ట్రానికి లాభ‌మే కానీ న‌ష్ట‌ము ఉండ‌ద‌న్నారు. జీఎస్టీ వ‌ల్ల ఏడాదికి రాష్ట్రానికి రెండు, మూడు వేల కోట్ల ఆదాయం వస్తుంద‌న్నారు. రూ.20 ల‌క్ష‌ల లోపు వార్షిక ట‌ర్నోవ‌ర్ గ‌ల వ్యాపారుల‌కు ప‌న్ను ఉండ‌దు అని తెలిపారు. రూ.75 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న వారికి  ఒక్క శాతం ప‌న్ను ఉంటుందన్నారు.

ఈ నెల 5,6,7 తేదీల్లో వాణిజ్య పన్నుల విభాగంలోని 91 సర్కిళ్లలో  జీఎస్టీపై సదస్సులు నిర్వహించాలని ఉన్నతాధికారులకు సీఎం నిర్దేశించారు. జీఎస్టీ అమలు చేయడం వల్ల లాభమా? నష్టమా? ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అనే విషయంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో..వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం అధికారులను ఆదేశించారు.

జీఎస్టీపై సమగ్రమైన నివేదిక తయారు చేసి అందించాలని అధికారులకు నిర్దేశించారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. జీఎస్టీని అన్ని రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిన పరిస్థితి నేపథ్యంలో మనం కూడా దీనిని అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.

చిన్న వ్యాపారాలన్నీ రూ.20 లక్షల లోపు టర్నోవర్ మాత్రమే కలిగి ఉంటాయి. ఓ మోస్తరు వ్యాపారులకు కూడా ఒక్క శాతం పన్ను మాత్రమే పడుతుంది. ఈ విషయంలో ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని వాణిజ్య పన్ను శాఖ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ అసలు స్వరూప, స్వభావాలను ప్రజలకు, వ్యాపారులకు విడమరిచి చెప్పి..వారిలో భయాందోళనలు పోగొట్టాలన్నారు. రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు ఉంది. ఇది తెలంగాణలోని లక్షల మంది చిన్న వ్యాపారులకు ఉపయోగకరమైన నిర్ణయం. కాబట్టి రాష్ట్రంలోని వాణిజ్యపన్ను శాఖ అధికారులు ఈ విషయాన్ని వ్యాపారులకు కూలంకషంగా వివరించి చెప్పాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కే.కేశవరావుతోపాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, సోమేశ్ కుమార్, రామకృష్ణరావు, అనిల్ కుమార్, వాణిజ్య పన్ను శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -