తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. బడ్జెట్ పై ప్రతిపక్షాలు పూర్తి అవగాహనతో మాట్లాడాలని….ప్రభుత్వం అప్పులు చేస్తుందనడం హాస్యాస్పదం అని తెలిపారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం…బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుని మాట్లాడాలన్నారు.
రాష్ట్ర రెవెన్యూలో 22 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఉద్యమ సమయంలోనే చెప్పామని….నేడు అదే నిజమైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పులు చేయకుండానే అభివృద్ధి చేస్తున్నాయా అని ప్రశ్నించారు. దేశం అప్పు రూ. 82 లక్షల కోట్లు కాగా అందులో మోడీ ప్రభుత్వం రూ.24 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి అప్పులు చేస్తే తప్పుకాదన్నారు. అనేక రంగాల్లో మంచి పనులు జరుగుతున్నాయని….కానీ తెలంగాణ మాత్రమే అప్పుల పాలైందనడం సరికాదన్నారు. ఏ రాష్ట్రంలో నిధులు ఉంటే ఆ రాష్ట్రంలో ప్రగతి సాధ్యమవుతుందన్నారు.తాము ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రం వద్దకు పోలేదని స్పష్టం చేశారు. అన్నీ అర్హతలు ఉండి పైరవీలు చేస్తే గాని కేంద్రం వద్ద పనులు జరగడం లేదన్నారు.
మిషన్ భగీరథ, కాకతీయకు రూ. 24 వేల కోట్లు అడిగితే 24 రూపాయాలు కూడా ఇవ్వలేదన్నారు సీఎం. ఈ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.