తెలుగు ఇండస్ట్ర్రీలో ఆడియో ఫంక్షన్స్ ఓ వేడుకలా జరుగుతాయి. అభిమానుల కోలాహాలం మధ్య హీరోలు ఆడియోను రిలీజ్ చేస్తారు. ఆడియో విడుదలకు వారం ముందు ఉండే హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుని హైప్ క్రియేట్ చేస్తారు. ఇక టాలీవుడ్ అగ్రహీరోల సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకే వేదికపై తమ అభిమాన నటులను చూసి మురిసిపొవచ్చు. మెగా ఫ్యామిలీ, నందమూరి, ఘట్టమనేని, అక్కినేని ఫ్యామిలీలలో ఇప్పటివరకు ఇదే జరిగింది.
అయితే, ఇలాంటి ట్రెండ్‌కు ఫుల్ స్టాప్ పెడుతు ఈ మధ్య కాలంలో మెగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆడియో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. సరైనోడు సినిమా నుంచి మెగా హీరోలు నటించిన ఏ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించలేదు.
రామ్ చరణ్ ధృవ, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ ను నిర్వహించలేదు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో వేడుకను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ( కిశోర్
పార్థసాని) దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఒక్క టీజర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాలతో వచ్చిన పవన్ సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. దీంతో మెగా ఫార్ములాకే జై కొట్టాలని పవన్ నిర్ణయించాడట.
అయితే ఆడియో ని రద్దు చేసినప్పటికీ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆడియో వేడుకను రద్దు చేసుకున్న మెగా హీరోలు అల్లు అర్జున్ ‘సరైనోడు’, రామ్ చరణ్ ‘ధ్రువ’, చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించి ఆ సినిమాలు హిట్ కొట్టారు. ఇక ఇదే బాటలో సాయిధరమ్ తేజ్ కూడా విన్నర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి మెగా సెంటిమెంట్‌ను ఫాలో అవ్వగా ఇప్పుడు పవన్ కూడా కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్‌గా నిర్వహించి హిట్ కొట్టాలని చూస్తున్నారట.