బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. బుధవారం సాయంత్రానికి పుదుచ్చేరి, తమిళనాడు సరిహద్దుల్లోని కరైకాల్, మామల్లాపురం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ తుపానుకు నివర్ అని నామకరణం చేశారు.
తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ప్రస్తుతం గంటలకు 100-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, ఇవి గంటకు 120 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
నివర్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయని, మరో మూడు రోజులపాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.