యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ నేడు విజయదశమి పర్వదినాన ప్రారంభమయింది. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
చిత్ర నాయకా,నాయిక లు నితిన్, కీర్తిసురేష్ లపై సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ గారు క్లాప్ నిచ్చారు. చిత్రం స్క్రిప్ట్ ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) లు దర్శకుడు వెంకీ అట్లూరి కి అందచేశారు. కెమెరా స్విచ్ ఆన్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రగతి ప్రింటర్స్ అధినేత శ్రీ పరుచూరి మహేంద్ర చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, జెమినికిరణ్,సుధాకర్ రెడ్డి,హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ..’ప్రేమ’ తో కూడిన కుటుంబ కథాచిత్రమిదని దర్శకుడు వెంకీ అట్లూరి’ తెలిపారు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించటం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ‘రంగ్ దే’ కి ఆయన స్వరాలు ఓ ఆకర్షణ అన్నారు. విజయదశమి రోజున ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూ గా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.