కర్ణాటక మంత్రి సారా మహేశ్ పై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడగు జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా 16 మంది చనిపోయారు. అంతేకాకుండా భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్మీ చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు శుక్రవారం ఆమె కొడగుకు చేరుకున్నారు. జిల్లాలో బాధితులను సీతారామన్ పరామర్శించారు.
ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీతారామన్ మాట్లాడుతుండగా కొద్దిసేపటి తర్వాత మంత్రి మహేశ్ బీజీ షెడ్యూల్ కారణంగా మీడియా సమావేశాన్ని త్వరగా ముగించాలని సూచించారు. దాంతో సహనం కోల్పోయిన ఆమె.. ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీరు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోంది. నమ్మలేకున్నా’ అని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా..అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేసిన ఆమె,ఏదేమైనా స మస్యను పరిష్కరించాలని కొడగు జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీవిద్యను మంత్రి ఆదేశించారు. కాగా..గట్టిగా మాట్లాడాలని మీడియా కోరగా ‘మైక్ లు ఆన్ లోనే ఉన్నాయి కదా.. కావాల్సినంత సేపు రికార్డు చేసుకోండి’ అంటూ జవాబిచ్చారు.
ఓ వ్యక్తి(మహేశ్) కారణంగా సమావేశం గదిలోని అందరినీ బాధపెట్టాలని తాను అనుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా మహేశ్, మంత్రికి స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం అనంతరం మహేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘సీతారామన్ తమిళనాడులో పుట్టారు. ఆంధ్రుడిని పెళ్లాడారు. కర్ణాటక రాష్ట్రం నుంచి బీజేప తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు.