నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఇప్పటికే దిల్లీ పటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులు రెండోసారి జారీచేసిన ఉరిశిక్షను తప్పించుకోవడానికి దోషులు పవన్, అక్షయ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
వీరిద్దరి తరపున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఇద్దరు దోషులు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని న్యాయవాది పిటిషన్లో ఆరోపించారు. ఈ కారణంగా వారు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునేందుకు ఆలస్యమైందని పేర్కొర్నారు.
కాగా, వీరి పిటిషన్‌పై శనివారం (రేపు) కోర్టు విచారణ జరుపనుంది. ఇప్పటివరకు వీరిద్దరూ క్యురేటివ్, క్షమాబిక్ష పిటిషన్లు పెట్టుకోలేదు. నలుగురు దోషుల్లో మరో దోషి ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.