భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. భారత్ నుండి పారిపోయిన 16 నెలల తర్వాత నీరవ్ లండన్లో దర్శనమిచ్చారు. లండన్ వీధుల్లో తిరుగుతు కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది టెలిగ్రాఫ్ నీరవ్‌కు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. టెలిగ్రాఫ్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలన్నింటికి నో కామెంట్ అని సమాధానం ఇచ్చిన నీరవ్ అక్కడినుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తొలుత క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించగా ఆ క్యాబ్ డ్రైవర్ నిరాకరించగా మరో కారు ఎక్కి అక్కడినుండి వెళ్లిపోయారు.
లండన్‌లోని సెంటర్ పాయింట్ టవర్ బ్లాక్ ఉంటున్నారు నీరవ్. నెలకు 17వేల పౌండ్లు(రూ.15 లక్షలు)పైగా అద్దె ఉంటుంది. ఇక మీడియాకు పట్టుబడిన సమయంలో నీరవ్ ధరించిన సూట్ విలువ 10,000 డాలర్లు(సుమారు రూ.7 లక్షలు) .లండన్‌లోని సోహోలో నీరవ్ వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. లండన్‌లో వ్యాపారం చేయాలంటే నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ తప్పనిసరి. భారత్‌లో అన్ని వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయి వచ్చిన వ్యక్తికి నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ ఎలా వచ్చిందని కూడా వారు ప్రశ్నించారు.
నీరవ్ మోడీ భారత బ్యాంకులకు రూ.13వేల 700 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డాడు.2018 జులైలో నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు నీరవ్‌కు చెందిన ఫాం హౌజ్,సోలార్ పవర్ ప్లాంట్,అహ్మద్ నగర్లో ఉన్న 135 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.