కాంగ్రెస్‌ను ప్రజలు క్షమించరు!

4
- Advertisement -

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేవలం 10 శాతం పనులు పూర్తయినా నీటిని వినియోగించుకోవచ్చని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తే అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.32 వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేసిందని, వాటికి సంబంధించి రూ.27 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించామని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణకు నీటి లభ్యతపై స్పష్టత వచ్చిందన్నారు. అప్పట్లో ముందే అప్రమత్తమై ఉంటే తెలంగాణ తన నీటి వాటాను కోల్పోయేదే కాదని అభిప్రాయపడ్డారు.

పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరీ మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కూడిన బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. నార్లపూర్ పంప్ హౌజ్, రిజర్వాయర్, వట్టెం పంప్ హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించి, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… జూరాల వద్ద సగటున 25 రోజులు వరద ప్రవాహం ఉంటుందని తెలిపారు. జూరాల ప్రాజెక్టును నిర్మిస్తే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. అంతా చేసినా జూరాల వద్ద నిల్వ నీరు ఉండదని పేర్కొన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తై అన్ని రిజర్వాయర్లు నిండితే 68 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అవసరమైతే మళ్లీ మళ్లీ నీటిని నింపుకోవచ్చని అన్నారు. దీని వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. తెలంగాణ నీటిని వినియోగించుకోవద్దనే ఉద్దేశంతోనే జూరాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.

జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు నలభై ఏళ్లుగా ప్రజలకు కల చూపిస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమేనని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రజలకు ఏమి కోల్పోయామో అర్థమైతే, కాంగ్రెస్‌ను ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. చరిత్రలో కాంగ్రెస్‌కు చోటుండదని, చరిత్రలో నిలిచేది కేసీఆరేనని స్పష్టం చేశారు. దొంగ మాటలు, మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవో నెంబర్ 24ను ఒకసారి పూర్తిగా చదవాలని సూచించారు. ఏపీ ట్రాప్‌లో కాంగ్రెస్ నేతలు పడిపోవద్దని హితవు పలికారు.

Also Read:పంట కొనుగోలుకై ఆదిలాబాద్ బంద్‌

- Advertisement -