రివ్యూ : నిన్ను కోరి

309
Ninnu Kori Review
- Advertisement -

వరుస హిట్ సినిమాలతో డబుల్ హ్యాట్రిక్‌ కొట్టి ప్రేక్షకులను మెప్పించిన హీరో నాని. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటించిన రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ నిన్ను కోరి.  నాని సరసన నివేదా థామస్ నటించగా ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో అలరించాడు.  ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని మరోసారి హిట్ టాక్‌ను తనఖాతాలో వేసుకున్నాడా…? ట్రయంగల్‌ లవ్ స్టోరీతో అలరించాడా లేదా చూద్దాం…

కథ :

వైజాగ్‌లో చదువుకునే ఉమా మహేశ్వరరావ్ (నాని), పల్లవి (నివేతా థామస్) ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఉమాను ప్రేమిస్తుంది. ఇంతలోనే పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు.  కానీ ఉమా మాత్రం లైఫ్లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కెరీర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఇంతలో పల్లవి తండ్రి ఆమె మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోకుండా ఆమెకు అరుణ్ (ఆది పినిశెట్టి) తో వివాహం నిశ్చయం చేస్తాడు. పల్లవి కూడా తన ప్రేమను తండ్రికి చెప్పలేని స్థితిలో అరుణ్ ను వివాహం చేసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుంది…? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి..? చివరికి కథ ఎలా సుఖాంతమైంది అన్నదే  మిగితా కథ.

Ninnu Kori Review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నాని, ఆది, నివేదా నటన, ఎమోషనల్ సీన్స్. నేచురల్ స్టార్‌గా నాని  మరోసారి తన స్ధాయిని ప్రూవ్‌ చేసుకున్నాడు. తన నటనతో చాలా సీన్స్‌లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించాడు నాని. సినిమాలో విలన్‌ లేకుండానే తానే ఆ బాధ్యత తీసుకుని ముందుకు నడిపించాడు. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా అలరించాడు. ఈ సినిమాతో ఆది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రీ క్లైమాక్స్ లో ఆది నటన సూపర్బ్.

ఇక హీరోయిన్‌గా నివేదా బెస్ట్ చాయిస్ అనిపించుకుంది. తన భర్త అరుణ్ (ఆది పినిశెట్టి), తన ఫస్ట్ లవ్ ఉమా మహేశ్వరరావు(నాని) మధ్య నలిగిపోయే పాత్రలో  అద్బుతమైన నటనను కనబర్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు కథకు నేచ్యురల్ అప్పియరెన్స్ తీసుకొచ్చి సినిమాను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేశారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు.

Ninnu Kori Review
మైనస్ పాయింట్స్ :

సినిమాలో రొమాంటిక్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్ మాత్రమే ఉండటంతో రెగ్యులర్ మాస్, కామెడీ ఎంటర్టైనర్లను కోరుకునే సింగిల్ స్క్రీన్ ఆడియన్సును ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించకపోవచ్చు. సినిమా మొత్తం ఫస్టాఫ్ గాని, సెకండాఫ్ గాని బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా వెళ్లిపోవడంతో ఎక్కడా పెద్దగా ఎగ్జైట్మెంట్ కలగలేదు.  క్లైమాక్స్ లో ఎమోషన్ ఉన్నా అది  పెద్దగా ఆకట్టుకోదు.  హడావిడిగా ముగిసిన క్లైమాక్స్ సినిమాకు మరో మైనస్.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాతో దర్శకుడు శివ నిర్వాణ అందరి దృష్టిని ఆకర్షించాడు. కథా ,కథనాలను అతను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సహ నిర్మాతగాను వ్యవహరించిన కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే సినిమా స్థాయిని పెంచింది. దర్శకుడు శివతో కలిసి కోన అందించిన మాటలు సినిమాకు మరో ఎసెట్. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి, వైజాగ్ అందాలతో పాటు ఫారిన్ లోకేషన్స్ ను అద్భుతంగా చూపించాడు కార్తీక్. డి. వి. వి దానయ్య పాటించిన నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

Ninnu Kori Review

తీర్పు :

రెగ్యులర్ ట్రయాంగులర్ లవ్ స్టోరిని కథగా ఎంచుకుని తెరకెక్కించిన దర్శకుడు శివను అభినందించాల్సిందే.  వాస్తవానికి దగ్గరగా ఉండే కథ, నాని,ఆది,నివేదా నటన, ఎమోషనల్ సీన్స్‌ సినిమాకు ప్లస్ కాగా ఎమోషన్ తగ్గిన క్లైమాక్స్, నెమ్మదైన స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్. మొత్తంగా  భిన్నమైన ప్రేమ కథతో   నాని విజయయాత్రను కంటిన్యూ చేసే చిత్రం నిన్నుకోరి.

విడుదల తేదీ: 07/07/2017
రేటింగ్ : 3.5/5
నటీనటులు : నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : డి.వి.వి దానయ్య
దర్శకత్వం : శివ నిర్వాణ

- Advertisement -