విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది. నిఖిల్ తాజా చిత్రం ‘కేశవ’ను అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ నామా రాజీపడకుండా నిర్మించడం, ‘స్వామి రారా’ వంటి హిట్ తర్వాత సుధీర్ వర్మ – నిఖిల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు నిదర్శనం ‘కేశవ’ బిజినెస్. ఈ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు.
నైజాంలో నిఖిల్ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ కావడం ఇదే తొలిసారి. సినిమా పై సునీల్ నారంగ్ కి ఉన్న నమ్మకం, అభిషేక్ నామాతో ఉన్న స్నేహం.. సునీల్ నైజం హక్కులను ఇంత ఫ్యాన్సీ రేటుకి కొనడానికి ప్రధాన కారణం. అభిషేక్-సునీల్ లది పంపిణీదారులుగా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అన్నారు.
‘గ్లోబల్ సినిమాస్’ ద్వారా అభిషేక్ – సునీల్ నారంగ్ పలు హిట్ చిత్రాలను పంపిణీ చేశారు. వాటిలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’, అక్కినేని కుటుంబానికి ప్రత్యేక సినిమాగా మిగిలిపోయిన ‘మనం’, నితిన్ కెరీర్ కి బాగా ఉపయోగపడిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’, మాస్ సినిమాల్లో సూపర్ అనిపించుకున్న సూర్య ‘సింగమ్’ ఉన్నాయి. ఇప్పుడు అభిషేక్ నిర్మాతగా మారి, తీస్తున్న తొలి చిత్రం ‘కేశవ’ను సునీల్ నారంగ్ నైజాం ఏరియాకి ఫ్యాన్సీ రేటుతో కొని, సినిమా పట్ల తనకున్న నమ్మకాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ – “సునీల్ నారంగ్ తో పంపిణీదారుడిగా నా ప్రయాణం బాగా సాగింది. ఇద్దరం కలిసి హిట్ చిత్రాలు అందించాం. ఇప్పుడు నా సినిమాని ఆయన కొనడం ఆనందంగా ఉంది. స్నేహం మాత్రమే కాదు… ‘కేశవ’ చిత్రం గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే అంత రేటు ఇచ్చారు. ఇతర ఏరియాల నుంచి కూడా భారీ ఆఫర్లతో దాదాపు బిజినెస్ పూర్తయింది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘స్వామి రారా’ ట్రెండ్ చేసినట్లుగానే ఈ ‘కేశవ’కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది” అని చెప్పారు.
‘పెళ్లి చూపులు’ ఫేమ్ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శి తదితరులు ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్., సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ, నిర్మాత: అభిషేక్ నామా, సమర్పణ: దేవాన్ష్ నామా.