పేషేంట్లు డాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తారన్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పేషేంట్లకు డాక్టర్లు నిరంతర సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. నేడు నిజామాబాద్ లోని తెలంగాణ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ , భారతీయ ఫిజిషియన్ల సంఘం నేతలతో ఎంపీ కవిత సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలువురు డాక్టర్లు సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేస్తున్న అభివృద్ది పథకాలు భేష్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆసుపత్రులకు పునః జన్మ వచ్చిందన్నారు. ఆసుపత్రులలో నూతన సౌకర్యాలతో పాటు, పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
వైద్య వృత్తి పవిత్రమైందన్నారు ఎంపీ కవిత. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని డాక్టర్లకు సూచించారు.ప్రభుత్వం, ప్రయివేటు ఆసుపత్రులు కలిసి పని చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య రంగాన్ని అభివృద్ది చేస్తున్న తీరు తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ అవకాశాన్ని డాక్టర్లు, నర్సులు వినియోగించుకొని ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఆహారపు అలవట్లు ప్రధానంగా రోగాలకు కారణం అవుతన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పూర్తయితే కలుషిత నీటిని తాగడం వల్ల వచ్చే అంటురోగాలు తగ్గిపోతాయన్నారు. కంటి పరీక్షలు కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల సమస్యలు త్వరలో తొలగిపోతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వరప్రసాదిని కాళేశ్వరం ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించాలని డాక్టర్లను ఎంపీ కవిత కోరారు.