రిటైర్మెంట్‌పై పూరన్‌ వెనక్కి!

3
- Advertisement -

టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ వెస్టిండీస్‌ (CWI) నికోలస్ పూరన్‌ను సంప్రదించింది. అయితే మాజీ కెప్టెన్ అయిన పూరన్ తన నిర్ణయంపై కట్టుబడి ఉన్నట్టు క్రికెట్ వెస్టిండీస్‌ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైల్స్ బాస్కోంబ్ వెల్లడించారు.

గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 29 ఏళ్ల పూరన్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్‌ల్లో మాత్రం కొనసాగుతున్నారు. రాబోయే నెలలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయనను మళ్లీ జట్టులోకి తీసుకురావాలా అనే అంశాన్ని CWI పరిశీలించింది. అయితే పూరన్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆసక్తి చూపలేదని బాస్కోంబ్ తెలిపారు.

వెస్టిండీస్ తరఫున అత్యుత్తమ ఆటగాళ్లు ఆడేలా చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాం. పూరన్‌తో కూడా మాట్లాడాం. వరల్డ్‌కప్ దగ్గర్లో ఉందన్న విషయం తెలిసే ఆయన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కూడా తన నిర్ణయాన్ని కొనసాగిస్తానని చెప్పారు అని బాస్కోంబ్ అన్నారు.

ఇక ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌లోకి వెస్టిండీస్ లెజెండ్స్ డ్వేన్ బ్రావో, కైరన్ పొలార్డ్, ఆండ్రే రస్సెల్‌లను తీసుకునే అవకాశాన్ని కూడా CWI పరిశీలించింది. అయితే వరల్డ్‌కప్ తర్వాత వెంటనే ఐపీఎల్ ఉండటంతో షెడ్యూల్ సమస్యలు ఎదురవుతున్నాయని బాస్కోంబ్ వివరించారు.

అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ అనంతరం వరల్డ్‌కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. పూరన్ రిటైర్మెంట్ కొనసాగుతుండటంతో, సీనియర్ లెజెండ్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రస్తుత ఆటగాళ్లతోనే వెస్టిండీస్ టోర్నీలో పోటీ పడనుంది.

Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -