న్యూజిలాండ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రైస్ట్‌చర్చ్ నగరంలో కాల్పులకు తెగబడ్డారు. నగరంలోని రెండు మసీదుల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 40 మంది మృతిచెందారు. శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ ప్రకటించారు. లిన్‌వుడ్ వద్ద పది మంది, డీన్ ఏవ్ మసీదు వద్ద మరో 30 మంది మృతిచెందారు. ఈ కాల్పుల ఘటనలో మరో 27 మంది గాయపడ్డారు. ఇదో అసాధారణ కాల్పుల ఘటన అని ప్రధాని జెసిండా అన్నారు. ఇది ఉగ్రవాద చర్యే అని ఆమె తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగుర్ని అరెస్టు చేశారు. అందులో ఓ మహిళ ఉన్నది.
అల్ నూర్ మసీదు వద్ద కాల్పులకు తెగబడ్డ దుండగుడు దాడినంతా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ఘనటను మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లు తెలిపాయి. ఆ వీడియో ప్రకారం దుండగుడు ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారెంట్‌గా తెలుస్తోంది. కారులో వచ్చిన దుండగుడు అల్ నూర్ మసీదుకు దగ్గరగా వాహనాన్ని నిలిపాడు. ఆ తర్వాత మసీదులోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. క్రైస్ట్‌చర్చ్‌కు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు ప్రధాని జెసిండా చెప్పారు.