టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ..టీమిండియా ప్రదర్శనపై ప్రశంసలు గుప్పించాడు. ఈ రోజు గొప్ప జట్టు ముందు, భారీ ప్రేక్షకుల సమక్షంలో మేము పూర్తిగా ఓడిపోయాం. టోర్నమెంట్ మొత్తం మా జట్టు మంచి పోరాటం చేసింది. కొన్ని సవాళ్లు ఎదురైనా ప్రతి దశలో మేము గట్టిగా పోరాడాం. ఫైనల్‌కు చేరడం పట్ల మా ఆటగాళ్లపై నాకు గర్వంగా ఉంది అని అన్నారు.
అలాగే స్వదేశంలో వరల్డ్ కప్ ఆడటం ఎంతటి ఒత్తిడితో ఉంటుందో కూడా సాంట్నర్ ప్రస్తావించాడు. స్వదేశంలో వరల్డ్ కప్ ఆడటం అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ (SKY) నాయకత్వంలో భారత జట్టు ఆ ఒత్తిడిని అద్భుతంగా ఎదుర్కొంది. జట్టులోని ఆటగాళ్లు వివిధ దశల్లో అద్భుతంగా ఆడారు అని ఆయన అన్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు, ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు చేయగా, చివర్లో శివం దూబే 8 బంతుల్లో 26 పరుగులతో రాణించి భారత్‌ను 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌కు చేర్చారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫర్ట్ 26 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధశతకం సాధించినప్పటికీ, అక్షర్ పటేల్ (3/27) మరియు జస్ప్రీత్ బుమ్రా (4/15) అద్భుత బౌలింగ్‌తో కివీస్‌ను కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

