దేశం గర్వించేలా సెక్రటేరియట్‌ నిర్మాణం: సీఎం కేసీఆర్‌

240
kcr
- Advertisement -

తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నె తెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం ఇవాళ పరిశీలించారు. సచివాలయ నిర్మాణంలో, సుందరీకరణకు వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్ నమూనాలను సీఎం పరిశీలించారు. నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు.

రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రగతి భవన్ లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే మార్గదర్శిగా నిలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సమీపంలో వున్న విధంగా ధోల్ పూర్ స్టోన్ తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించుకోవాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -