ఆర్బీఐ విడుదల చేసిన రూ.500 కొత్త నోట్లు రాష్ర్టానికి చేరినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. చిల్లర సమస్య తీర్చేందుకు పలు జిల్లాలకు నోట్లు పంపిణీ చేయనున్నారు. ఆర్బీఐ అనుమతితో దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే కొత్త నోట్లు వచ్చాయని పేర్కొన్నారు. 500నోట్లు అందుబాటులోకి వస్తే..కొంతవరకు చిల్లర సమస్య కొంతవరకు తీరుతుందని అధికారులు తెలియజేశారు. దీంతో సరఫరా పెరిగి డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నగదు కోసం ఉన్న డిమాండ్‌పై ఆర్బీఐ సమాచారం అడగగా, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద అంతగా డిమాండ్ లేదని, పట్టణాల్లో మాత్రం భారీగా బారులు తీరుతున్నారని బ్యాంకర్లు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా ఎస్పీఐ, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు శాఖలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
500 రూపాయల నోట్లతో..పాటు 20 రూపాయల నోట్లను కూడా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రజల నుంచి చిల్లర కావాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మహబూబ్‌నర్, జోగులాంబ గద్వాల, నిర్మల్, మంచిర్యాల తదితర జిల్లాలకు రూ.20 డినామినేషన్ నోట్లు సరఫరా చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో నగదు నిల్వలు రెట్టింపు చేస్తే జనానికి డబ్బు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. పోస్టాఫీసులు, బ్యాంకులకు ఎప్పుడు వెళ్లినా డబ్బులు లభిస్తాయనే భరోసా ఉంటే జనం రావడం తగ్గుతుందని సర్కారు గుర్తించినట్లు తెలిసింది. దీని ఆధారంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నగదు నిల్వలు పెంచాలని ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది.
గ్రామాల్లో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గినట్లు సమాచారం. ముఖ్యంగా భూపాల్‌పల్లి, మెదక్ జిల్లాల్లో సమస్య లేదని, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కావాల్సినంత నగదు అందుబాటులో ఉండటంతో ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి లేదని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. మిగతా జిల్లాలో మాత్రం ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. అయితే బిజినెస్ కరస్పాండెంట్లకు రోజుకు రూ. 50 వేలు పంపిణీ చేసే అధికారం కల్పించడం ఊరటనిస్తున్నది. సహకార బ్యాంకుల్లో పాత నోట్లు స్వీకరించకపోవడం రైతులకు ఇబ్బందిగా మారిందని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.