కొత్త జిల్లాలు, కొత్త రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటైన రోజునుండే పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం అధికారగణాన్ని సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు కార్యాలయాలు మొదటి రోజు నుండే పనిచేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు బుదవారం సెక్రటేరియట్ లో సిఎం అదనపు ముఖ్య కార్యదర్బి శాంతికుమారి వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. మండలాలు, డివిజన్లు, జిల్లాల్లో కొత్తగా పని చేయడానికి ఎంత మంది ఉద్యోగులు అవసరం, ఎన్ని క్యాడర్ పోస్టులు అవసరం ఉంది ? వాటిని ఎలా భర్తీ చేయాలి ? అనే అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. కొత్తగా 3252 పోస్టులు అవసరం పడతాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
ప్రతీ క్యాడర్ లోనూ పోస్టులు పెరిగే అవకాశముంది. అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి పోస్టుల భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రెవెన్యూ పోలీసు శాఖల్లో ఎక్కువ పోస్టులు అవసరమొస్తాయి కాబట్టి అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు మండాలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్టేషన్లు, తదితర కార్యాలయాల నిర్వాహణకు సత్వరం ఏర్పాట్లు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.