త్వరలో నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పన..

291
CM KCR
- Advertisement -

గ్రామాల పట్టణాల గుణాత్మక అభివృద్దిలో పంచాయితీరాజ్ మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని సీఎం కేసీఆర్‌ అన్నారు, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఉన్న చట్టాలను సవరించుకుంటూ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం వున్నదని, తద్వారా  ప్రజలకు గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో సుపరిపాలన అందించగలుగుతామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ, నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పనపై సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ … ‘‘ పంచాయితీ రాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్దతిలోనే, అవినీతి రహితంగా పాలన అందే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మున్సిపల్ చట్టం రూపకల్పనచేయాలె. నూతన పంచాయితీ రాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలె. ‘ మనం మనుసు పెట్టి పనిచేస్తే గ్రామాలు మున్సిపాలిటీ స్థాయిల్లో కావాల్సినంత పని వున్నది. ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ విషయాన్ని గ్రహించాలె. ఇక్కడ పని వొదిలి ఇంకెంక్కడనో వున్నట్టు నేల విడిచి సాము చేయవద్దు.

CM KCR

విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన నుంచి గ్రామాల్లో పచ్చదనం పరిశ్రుభ్రతతో పాటు ఇతర మౌలిక రంగాల అభివ్రద్ది చేపట్టాల్సిన బాధ్యత మనమీదున్నది. మున్సిపాలిటీలు దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు మేలయిన పాలన అందించవలసిన విషయాన్ని మనం గమనించాలె. ఇందుకు సంబంధించిన చట్టం అమలు విషయంలో అటు ప్రభుత్వ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని రూపొందించాలె. మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలుగుతే ప్రజలకు అంత గొప్పగా సేవలందించగలుగుతాం’’ అని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మల్యే ఆరూరు రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, కమీషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -