బ్యాంకుల్లో కొత్త నోట్ల జారీ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచే కొత్త నోట్లను తీసుకునేందుకు జనం బ్యాంకుల ముందు క్యూ కట్టారు. పాతనోట్లు మార్చుకునేందుకు ప్రభుత్వ, ప్రవేటు బ్యాంకులతో పాటు ఆర్బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వినియోగదారుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి పంపిస్తున్నారు.
దేశంలో అక్కడ, ఇక్కడ అని లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బ్యాంకులలో కౌంటర్ల వద్ద గుర్తింపు కార్డులు ఇచ్చి నోట్లను మార్చుకోవచ్చని, రోజుకు ఇలా ఒక వ్యక్తికి రూ. 4 వేల వరకు ఇస్తామని చెప్పడంతో, ముఖ్యంగా రోజువారీ ఖర్చులు గడవడానికి డబ్బుల కోసం చాలా మంది బ్యాంకుల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో బ్యాంకుల్లో తీవ్ర రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర క్యూకట్టారు.
కొత్త నోట్లను తీసుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చి నోట్లను అందరికి చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నా…మొన్నా జేబులో పెద్దమొత్తంలో డబ్బులు ఉన్నా…. ఖర్చుపెట్టుకోలోని పరిస్థితి.. దీంతో చాలా అవసరాలను పెండింగ్ లో పెట్టేసుకున్నారు సామాన్య జనం. అయితే రెండు రోజుల గ్యాప్ తర్వాత కొత్త నోట్లు మార్కెట్లోకి రావడంతో రిలీఫయ్యారు.
రెండో శనివారం, ఆదివారం అయినా ఆ రెండు రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని, రాత్రి 8 గంటల వరకు బ్యాంకుల్లో అదనపు కౌంటర్ల సాయంతో కూడా కొత్త నోట్లు ఇస్తామని ప్రకటించినా… రష్ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో పొద్దున్నే పలువురు తమ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల జిరాక్సు కాపీలు, డబ్బులు తీసుకుని బ్యాంకులకు బయల్దేరిపోయారు.
ఖాతా నుంచి నేరుగా డబ్బు తీసుకోలంటే రూ.10 వేల పరిమితి విధించారు. వారంలో రూ.20వేల వరకు డ్రాచేసుకోవచ్చు… ఈ రోజు రూ.2000 నోట్లను ఇవ్వనున్న బ్యాంకులు… రేపటి నుంచి రూ.500 కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.