TG:నూతన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు

5
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, ఐటీ సంస్థలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు అధికంగా ఉండటంతో రంగారెడ్డి జిల్లాను అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని తెలంగాణ సర్కార్ పునర్విభజించిన విషయం తెలిసిందే. గతంలో మూడు జిల్లాలు, మూడు పోలీస్ కమిషనరేట్లు ఉండగా, తాజా పునర్విభజనలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్లుగా మార్పులు చేసింది. కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లుగా సరిహద్దులు ఖరారు చేసింది. ఈ క్రమంలోనే మూడు జిల్లాల పరిధిని కూడా పునఃసమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధికి అనుగుణంగా ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల సరిహద్దుల్లో మార్పులపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ప్రణాళిక ప్రకారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు. షాద్‌నగర్, శంషాబాద్ రూరల్ మండలం, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం మండలాలను కలిపి రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విభజనతో పరిపాలన మరింత సమర్థవంతమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Also Read:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

 

- Advertisement -