ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకు 152 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా 5,839 మంది మృతిచెందినట్లుగా సమాచారం. ఇక బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షా 56 వేల 730 మందికి చేరింది. కరోనా మృతుల సంఖ్య చైనాలో 3,199, ఇటలీలో 1,441, ఇరాన్‌లో 611, దక్షిణకొరియాలో 75, స్పెయిన్ 196, ఫ్రాన్స్ 91, అమెరికాలో 60కి చేరుకుంది. కాగా భారత్‌లోని పలు రాష్ట్రాలలో కలుపుకొని కరోనా కేసుల సంఖ్య 107కి చేరింది.
అందులో తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నేడు నమోదైన ఈ కేసుతో కరోనా వైరస్ కేసులో తెలంగాణలో మూడుకు చేరుకున్నాయి.
కాగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన మొదటి వ్యక్తికి పూర్తిగా నయమవడంతో డిశ్చార్జ్ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధిభారిన పడ్డ మరో ఇద్దరికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. కరోనా కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లు, ఆఫీసులు బంద్ అయ్యాయి. ఈ వైరస్‌ను నివారించేందుకు ఆయా రాష్ట్రాలు ముందుస్తు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నాయి.