నగరంలో సరికొత్త బొటానికల్ పార్క్‌ సిద్ధం..

230
New Botanical Garden Redy
- Advertisement -

హైదరాబాద్, హైటెక్ సిటీ వాసులకు సరికొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి వస్తోంది. కొత్తగూడ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఇప్పటికే ఉన్న బొటానికల్ గార్డెన్ ను ప్రకృతి సహజత్వం మధ్య, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు అందేలా తీర్చి దిద్దారు. కాంక్రీట్ జంగిల్ లా మారి, నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ సేద తీరేలా బొటానికల్ గార్డెన్ ఆధునీకరించబడింది. మొత్తం 274 ఎకరాల అటవీ భూమిలో 12 ఎకరాలను సందర్శకుల పార్కుగా ఆధునీకరించారు. నగర వాసులకు స్వచ్చమైన గాలిని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో భాగంగా అన్ని హంగులతో బొటానికల్ పార్క్ సిద్దమైంది.

New Botanical Garden

వాకింగ్ , జాగింగ్ , సైక్లింగ్, యోగా, జిమ్ లాంటి సౌకర్యాలకు తోడు, వారాంతాల్లో కుటుంబ సమేతంగా సేద తీరేలా ఈ అర్బన్ పార్క్ ను అటవీ అభివృద్ది సంస్థ తీర్చి దిద్దిందని చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తెలిపారు. బొటానికల్ గార్డెన్‌కు వచ్చే పిల్లలకు ప్రకృతి, అడవులు, వన్యప్రాణులపై అవగాహన కలిగేలా, పర్యావరణం ప్రాముఖ్యత తెలిసేలా పరిసరాలను తీర్చిదిద్దామన్నారు.

హైటెక్ సిటీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రజలకు సేదతీరే ప్రదేశంలా ఉండాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు, సుమారు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఫారెస్ట్ కార్పొరేషన్ సందర్శకుల కోసం అదనపు వసతుల కల్పన పనులు చేపట్టింది. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్, వీడియో హాల్, ఇండోర్ జిమ్, స్కేటింగ్ రింగ్, ట్రీ కాటేజీ, బాంబూ హౌస్, యోగా సెంటర్, ఫుడ్ కోర్టు, సావనీర్ షాప్‌లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు కార్పోరేషన్ ఎం.డీ, వైస్ చైర్మన్ చందన్ మిత్రా తెలిపారు.

New Botanical Garden

ఆధునీకరించిన పార్క్ ను ఇటీవల పరిశీలించిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సంతృప్తిని వ్యక్త చేశారు. త్వరలో హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయబోయే అర్బన్ ఫారెస్ట్ పార్కులకు బొటానికల్ గార్డెన్ ఒక మోడల్ గా నిలుస్తుందనే ఆశాభావాన్ని చీఫ్ సెక్రటరీ ఎస్.కే.జోషీ వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రతీ అటవీ బ్లాక్‌లో కొంత ప్రాంతాన్ని అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా తీర్చి దిద్దుతామని, మిగతా ప్రాంతాన్ని అటవీ సంరక్షణ ప్రాంతాలుగా ఉంచుతామన్నారు.

New Botanical Garden

అటవీ అభివృద్ది సంస్థ త్వరలోనే మరో నాలుగు అర్బన్ ఫారెస్ట్ లను కూడా అభివృద్ది చేయబోతోంది. తమ నిరంతర కృషి, పర్యాటకులు, స్థానికుల ఫీడ్ బ్యాక్‌తో ఫేస్ బుక్ పేజీ రేటింగ్ 4.3ను, అలాగే గూగుల్‌లో 4 పాయింట్ల రేటింగ్‌ను సాధించినట్లు అధికారులు తెలిపారు. బ్యాటరీతో నడిచే వాహనాలు, 30 కేవీ సోలార్ ఎనర్జీ లాంటి ప్రత్యేకతలు పర్యావరణ హితాన్ని విజిటర్స్‌ను దగ్గరచేయనున్నాయి. సందర్శకుల కోసం పెద్దలకు 25 రూపాయలను, పిల్లలకు పది రూపాయలు పార్క్ ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు.

- Advertisement -