పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికే విపక్షాలతో పాటు..సామాన్య ప్రజానికం నుంచి విమర్శలు ఎదుర్కోంటున్న మోడీ కి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. కొత్త నోటుపై జాతీయ జంతువు బెంగాల్ టైగర్ చిహ్నం లేకపోవడంతో కేంద్రప్రభుత్వం..ఆర్‌బీఐ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు వేల రూపాయల నోటుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త వివాదానికి తెర లేపారు. ఈ నోటుపై జాతీయ జంతువు బెంగాల్ టైగర్‌ను ముద్రించలేదని పేర్కొంటూ.. ప్రధాని మోదీ రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపించారు.
‘‘జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. రెండు వేల నోటుపై ఏనుగు, జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్పం కమలం బొమ్మలను ప్రత్యేకంగా ముద్రించారు. కానీ, వాటి పక్కన జాతీయ జంతువు బెంగాల్ టైగర్‌కు చోటు కల్పించలేదు.
ఆర్‌బీఐ చిహ్నంలో మాత్రమే పులి బొమ్మ ఉంది. ‘ఏనుగు మన జాతీయ వారసత్వం’ అని మోదీ అంటారు. కానీ, ఆయన జాతీయ జంతువును విస్మరించారు. రెండు వేల నోటుపై బెంగాల్ టైగర్‌ను ప్రత్యేకంగా ఎందుకు ముద్రించలేదో మోదీ స్పష్టం చేయాలి’’ అని మమత డిమాండ్ చేశారు.