ఇజ్రాయెల్ ఎన్నికలపై వెలువడుతున్న అంచనాలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాన్ని సూచిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 50 నుంచి 53 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని కూటమికి 42 నుంచి 48 సీట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీపై ఉత్కంఠ నెలకొంది.
ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే నెతన్యాహు కూటమి ఈ మ్యాజిక్ ఫిగర్‌కు 8 నుంచి 11 సీట్ల దూరంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఐసెన్‌కోట్ కూటమి కూడా మెజారిటీకి అవసరమైన సంఖ్యను చేరుకోవాలంటే అదనపు మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.
ఈ ఎన్నికల అంచనాల్లో అరబ్ నేతృత్వంలోని పార్టీలకు సుమారు 19 సీట్లు వచ్చే అవకాశం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంతో పోలిస్తే ఈ పార్టీల బలం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో అరబ్ పార్టీల మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది.
Also Read:అమాంతం పడిపోయిన గూగుల్ షేర్లు

