భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. భారత సంప్రదాయ పద్ధతిలో ఆయనకు అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. అనంతరం బాలేంద్ర షా గౌరవ వందనం స్వీకరించారు.
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా నవంబర్ 23, సోమవారం అయోధ్య ధామ్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు కొత్త రైలు సేవలను ప్రారంభించనున్నారు. ఈ రైలు సర్వీసు ద్వారా ఇరు పొరుగు దేశాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
సోమవారం ప్రధాని మోదీతో బాలేంద్ర షా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో భారత్-నేపాల్ సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ బాలేంద్ర షా సమావేశం కానున్నారు.
ఈ పర్యటనలో జలవిద్యుత్, రైల్వేలు, మౌలిక సదుపాయాలు, సరిహద్దు కనెక్టివిటీ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునే అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.
Also Read:కీసరగుట్టలో మొక్కలు నాటిన సంతోష్ కుమార్
ముఖ్యంగా నేపాల్ పశ్చిమ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు భారత గగనతల మార్గాల ద్వారా అదనపు విమాన ప్రవేశ మార్గాలను పొందే ప్రయత్నాలు కూడా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న బాలేంద్ర షాకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు.

