నేపాల్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రధాని, రాష్ట్రపతి గృహాలకు నిప్పంటించారు ఆందోళనకారులు. కాఠ్మండు సహా నేపాల్ పలు ప్రాంతాల్లో యువత ఆందోళనలు చేపట్టగా వరుసగా రెండో రోజు కూడా వీధుల్లో రాళ్లు రువ్వుతూ, నినాదాలు చేస్తూ ప్రదర్శనలు కొనసాగించడంతో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేసింది.
ప్రధాని కేపీ శర్మ ఓలి సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసిన ఒకరోజు తర్వాతే నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఆ నిషేధం ఎత్తివేత జెన్‌జెడ్ యువత డిమాండ్ తీర్చడానికే అయినప్పటికీ, ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగింది. నిరసనకారులు రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్, ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యక్తిగత గృహాలకు నిప్పంటించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో నిరసనకారులు రాష్ట్రపతి గృహంలోకి వెళ్లి ధ్వంసం చేసిన దృశ్యాలు కనిపించాయి.
మాజీ ప్రధాన మంత్రులు పుష్పకమల్ దహాల్ (ప్రచండ), షేర్ బహదూర్ దేబా, అలాగే ఇంధన మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లను కూడా ఆందోళనకారులు దెబ్బతీశారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తూ ప్రభుత్వానికి దూరం కావడంతో, ప్రధాని ఓలి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది.
Also Read:అజయ్ దిషన్.. ‘బుకీ’
సోమవారం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కనీసం 19 మంది మరణించారు. పదివేలల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి, “సోషల్ మీడియాను నిషేధించవద్దు, అవినీతిని ఆపండి” అంటూ నినాదాలు చేశారు.

