వరుస విజయాలతో జోష్ మీదున్న నానికి యూత్ లో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజే వేరు. ఎవడే సుబ్రమణ్యం దగ్గరి నుంచి మజ్ను వరకు వరుసగా ఐద్ హిట్స్ కొట్టిన నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు చేసిన ప్రయత్నమే నేను లోకల్. నాని సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలు ప్రేక్షకులు థియేటర్‌కి క్యూ కడతారు. సహజనటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాని ప్రేక్షకుల హృదయాల్లో స్ధానం సంపాదించుకున్నాడు. దిల్ రాజు, నాని సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో సినిమా చూపిస్త మావ దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని నేను లోకల్‌తో ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం.
కథ:
బాబు(నాని) ఎంతో కష్టంగా సప్లీలు రాసి ఫైనల్ గా ఇంజనీరింగ్ పూర్తి చేసేస్తాడు. ఈ క్రమంలో బాబుకి కీర్తి(కీర్తి సురేష్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతాడు. కీర్తి చదివే కాలేజీలోనే చేరతాడు బాబు. కీర్తికి మాత్రం లవ్ మ్యారేజ్ అంటే ఇష్టముండదు. తనను ఎంతో ప్రేమగా చూసుకునే తన తండ్రి ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రోజు తనకు ఎదురయ్యే బాబుని చూసి విసుకున్నా.. కొన్ని రోజులకి కీర్తి, బాబు ప్రేమలో పడిపోతుంది. అదే సమయంలో కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం ఉండాలని పోలీస్ ఉద్యోగం సంపాదిస్తాడు సిద్ధార్థ్ వర్మ(నవీన్ చంద్ర). కీర్తి తండ్రి సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకోమని కీర్తికి చెబుతాడు. ఆ తరువాత ఏం జరిగింది..? తండ్రి మాటకు గౌరవం ఇచ్చిన కీర్తి… సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుందా ..? లేక బాబును పెళ్లి చేసుకుందా అన్నదే మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నాని. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం.. కూతురు సంతోషంగా ఉండాలంటే అన్నివిధాల యోగ్యుడైన వాడినే తనకిచ్చి పెళ్లి చేయాలని తండ్రి ఆలోచించడం.. చివరగా తన కూతురు ఎవరిని ప్రేమిస్తుందో వారికి ఇచ్చి పెళ్లి చేయడం ఇప్పటికే చాలా సినిమాలు ఇదే పాయింట్ తో వచ్చాయి. కానీ తన నటనతో సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. సినిమాలో నాని చెప్పే ప్రతి డైలాగ్ నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. చదువు గురించి, ప్రేమ గురించి నాని చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టిస్తాయి. నవీన్ చంద్ర తన పాత్రకు న్యాయం చేశాడు. రియలిస్టిక్ గా నటించాడు. పోసాని కృష్ణమురలి ఆడియన్స్ ను అక్కడక్కడా నవ్విస్తాడు. సచిన్ ఖేడ్కర్ హీరోయిన్ తండ్రిగా బాగా నటించాడు. రఘు బాబు, ఈశ్వరి రావు తమ పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు. టెక్నికల్ గా కూడా సినిమా బావుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ రన్ టైమ్. నిడివి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు కావటంతో ఏదో పెద్ద సినిమాను చూసేసిన ఫీలింగ్ కలుగుతుంది. లవర్‌కు తెలియకుండా హీరో కార్పొరేటర్ ఎలా అవుతాడో తెలియదు..ఇలా లాజిక్ మిస్ అయ్యింది. నవీన్ చంద్ర పాత్రకు ప్రాధాన్యం ఇవ్వలేదు.కథలో తరువాత ఏం జరగబోతుందనే విషయాన్ని ఆడియన్స్ఊహలకు అందకుండా ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.
సాంకేతిక విభాగం:
ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకుడు త్రినాథరావు..చెప్పాలనుకున్న పాయింట్ పాతదే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. దేవిశ్రీ తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. సాయికృష్ణ, ప్రసన్నకుమార్‌లు రచన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. మంచి డైలాగ్స్‌ను రాయించారు. నిర్మాణ విలువలు బావున్నాయి.
తీర్పు :
వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న హీరో నాని. వరుసగా ఐదు హిట్ సినిమాల తర్వాత నేను లోకల్ అంటూ వచ్చిన నాని డబుల్ హ్యాట్రిక్‌తో ప్రేక్షకుల మెప్పించాడు. పాత కథే అయినా నాని నటనతో త్రినాథరావు కొత్తగా చెప్పే ప్రయత్నం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాని నటన, డైలాగ్స్ సినిమాకు ప్లస్ కాగా రన్ టైం సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా నేను లోకల్ అంటూ వచ్చి తన ప్రేమకథను గెలిపించుకున్న బాబు గాడి ప్రేమకథ యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది.
విడుదల తేదీ:03/02/2017
రేటింగ్: 3.5/5
నటీనటులు:నాని, కీర్తి సురేష్
సంగీతం:దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
కథనం- దర్శకత్వం : త్రినాథ రావు నక్కిన