తేజ దర్శకత్వంలో రానా, కాజల్ జంటగా నటించిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 11న థియేటర్స్ లోకి వచ్చేందుకు సిద్ధమైన చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. టీజర్, ట్రైలర్ తో మూవీ పై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ సినిమాతో ఆడియన్స్ కి మంచి ట్రీట్ అందిస్తారని టాక్.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలోనూ, అమరావతిలోనూ చిత్ర బృందం ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో హీరో రానా, హీరోయిన్ కాజల్ పాల్గొన్నారు.. విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఈ బృందం ట్రెడ్ సెట్ మాల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రేక్షకులతో ఈ మూవీ విశేషాలు పంచుకున్నారు.
ఆ తర్వాత కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి వెళ్లి అక్కడ విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేనే రాజు నేనే మంత్రి మంచి చిత్రమని, అందరూ చూడాలని కోరాడు రానా. మంచి కథా కథనంతో ఉన్న చిత్రమని అంటూ ఇది పూర్తిగా రాజకీయ చిత్రం కాదని వివరించాడు.. సినిమా మొత్తంలో ఒక పది నిమిషాలే రాజకీయ పరమైన సీన్స్ ఉంటాయని వెల్లడించాడు.
జోగేంద్ర అనే వ్యక్తి అయిదేళ్లలో ఎటువంటి మార్పు చెందాడనేదే ఈ మూవీ కథాంశంమని పేర్కొన్నాడు. ఇక ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా సినీ పరిశ్రమ దాని ప్రయాణం అది చేస్తుందని చెప్పాడు. అయితే డ్రగ్స్ వంటివి ప్రోత్సహించడం ప్రమాదకరమని, తన వరకు తాను నిబద్ధత గా సినిమాల్లో నటిస్తుంటానని చెప్పాడు. ఈ సినిమా మంచి కథతో ముందుకు వస్తోందని, దానిని ఆదరించాలని రానా సూచించాడు. హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ, ఈ మూవీలో రాధ పాత్రలో కనిపిస్తానని పేర్కొంది.