నీట్ పేపర్ లీక్..కీ అప్‌డేట్

2
- Advertisement -

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో అరెస్టైన మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావంకర్కు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. పరీక్షకు ముందే కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాన్ని పొందేందుకు ఆయన రూ.5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

సీబీఐ వాదన ప్రకారం..నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రశ్నాపత్రాల రూపకల్పన బృందంలో ఉన్న సహ నిందితుడి ద్వారా కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే సేకరించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించింది. ఈ ప్రశ్నల ఆధారంగా చేతితో నోట్స్ సిద్ధం చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. దర్యాప్తులో మోటేగావంకర్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులో కెమిస్ట్రీకి సంబంధించిన చేతిరాత ప్రశ్నలు ఉన్న పలు చిత్రాలను గుర్తించారు. వాటిలోని 111 ప్రశ్నలు నీట్-యూజీ 2026 అధికారిక మాస్టర్ ప్రశ్నాపత్రాలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

అలాగే, ప్రశ్నాపత్రం పొందేందుకు చెల్లించినట్లు చెబుతున్న రూ.5 లక్షల నగదును కూడా సహ నిందితుడి సమాచారంతో స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేయగా, వారంతా న్యాయపరమైన కస్టడీలో ఉన్నట్లు తెలిపింది. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది.

Also Read:కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్‌ భేటీ

- Advertisement -