పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా వైపు మళ్లిందని, ప్రస్తుతం భూమి నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.
ఈశాన్య రుతుపవనాలు 20న వచ్చే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల కోసం ప్రజల్లో నిరీక్షణ మొదలైంది. గత ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైతో సహా నాలుగు జిల్లాలు మునిగిపోయిన దృష్ట్యా ఈ ఏడాది వర్షాల పరిస్థితి అంచనాలపై అందరూ దృష్టి సారిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయాయని, త్వరలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ రుతుపవనాలు ఈ నెల 20న ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మూడు నెలల్లో 40 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో 4.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదవగా, అత్యధికంగా రామగుండం మండలంలో 13.1 సెంటీమీటర్లు, జూలపల్లి 9.2, మల్యాల 9, సుల్తానాబాద్ 8.5, ఓదెలలో 7.4 సెం.మీ. వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సగటున 3.91 సె.మీ. వర్షపాతం నమోదైంది.