జాతీ, జాతీయత, దేశభక్తి గురించి నా అభిప్రాయాలను పంచుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ మీటింగ్‌కు వచ్చానని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆరెస్సెస్ ఆఫీస్‌లో అడుగుపెట్టారు. ఆయనకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత కార్యాలయం అంతా తిరిగి చూశారు.
అనంతరం ఆరెస్సెస్ ప్రచారక్‌ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ సిల్క్ రూట్, స్పైస్ రూట్ ప్రపంచంతో భారత్ కు వాణిజ్య బంధం ఏర్పరిచాయని, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూశామని, వైవిధ్యతను, భిన్నత్వాన్ని మనం గౌరవించాలని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వసుదైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్న భావన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. భిన్నసంస్కృతులు ప్రపంచ దేశాలకెల్లా మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని, అనేక మంది విదేశీ యాత్రికులు భారతీయత గురించి స్పష్టమైన అవగాహన ఇచ్చారని, తక్షశీల, నలంద, విక్రమశిల భారతీయ విద్యావ్యాప్తికి నిదర్శమని ప్రణబ్ అన్నారు. బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవిన విధానంలో ఉందని, అసహనం, ఆందోళన అన్నది మన జాతీయ భావనను దెబ్బతీస్తాయని ప్రణబ్ అన్నారు.
జాతీ, జాతీయత అన్న భావన ఐరోపా కంటే ముందే భారత్ లో ఏర్పడిందని, ఈస్టిండియా కంపెనీ దేశంలో చాలా భాగాన్ని ఆక్రమించిందని, ఈస్టిండియా కంపెనీ కేంద్రీకృపాలనను తీసుకొచ్చిందని, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చింది మౌర్యులని, అశోకుడి సమయంలో దేశమంతా భౌగోళికంగా ఏకచక్రాధిపత్యం కిందకు వచ్చిందని, 12వ శతాబ్దం తర్వాత ముస్లిం రాజులు ఢిల్లీని వశం చేసుకున్నారని, 600ఏళ్ల ముస్లింల పాలన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని ఆక్రమించిందని, 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటీష్ పరిపాలన కిందకు వెళ్లిందని, 5వేల ఏళ్ల నిరంతర దాడులు, ఆక్రమణల తర్వాత కూడా భారతీయ సంస్కృతి నిలిచే ఉందని ప్రణబ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు కూడా మన జీవిన విధానంలో విలీనమయ్యాయని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్వరాజ్యమే నా జన్మహక్కని నినదించిన నేత బాలగంగాధర్ తిలక్ అని సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత నిలబడి ఉంటుందని, ఎవరి నమ్మకాలు, ఆలోచనలు ఏవైనా జాతీయత మాత్రం ఒక్కటేనని, 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పటేల్ చేసిన కృషి అనిర్వచనీయమని, సంస్థానాల విలీనంలో భారత దేశానికి ఒకరూపు తెచ్చిన నేత సర్దార్ పటేల్ అని ప్రణబ్ గుర్తు చేశారు.
దేశం కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం భారత రాజ్యాంగమని, స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చిన బహుమానం కాదని, పోరాడి తెచ్చుకున్నదని, భారతదేశం ఒకభాష, ఒక మతం అని ఎప్పటికీ ఊహించలేమని, 130 కోట్ల మంది 122 భాషలు, 1600 మాండలీకాల్లో మాట్లాడతారని, ఇంతటి వైవిధ్యం ఏకతాటిపై నడవడం గొప్పవిచిత్రమని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఎన్ని వైరుద్ధ్యాలున్నా… అందరిది ఒకటే బాట భారతీయత అన్నారు ప్రణబ్ ముఖర్జీ.
సంక్లీష్ట సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని, మన కళ్ల ముందు జరుగుతున్న హింస, మన మనసుల్ని కలిచివేస్తోందని, శారీరకమైన లేదా భావవైరుద్ధ్యాల వల్ల రగిలే హింస వల్ల కల్లోలం చెలరేగుతోందని ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందమే జీవన మకరందమన్నది మానవజీవన ఉత్కృష్టత అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.