ఐపీఎల్ 10 సీజన్లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకోగా.. పదో ఓటమితో బెంగళూరు తన పరాజయ పరంపరలో కొత్త మైలురాయిని అందుకుంది. సునీల్ నరైన్ (54; 17 బంతుల్లో 6×4, 4×6), క్రిస్ లిన్ (50; 22 బంతుల్లో 5×4, 4×6) చెలరేగిపోవడంతో 159 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 15.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అవతారం ఎత్తిన వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 15 బంతుల్లోనే ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి ఔరా అనిపించాడు.
ఛేదనలో కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. అనికేత వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 4, 4, 6 బాదిన క్రిస్ లిన్.. మూడో ఓవర్‌లోనూ 4, 6, 4తో వీర విహారం చేశాడు. ఇక శామ్యూల్ బద్రీ వేసిన నాలుగో ఓవర్‌లో నరైన్ 6, 6, 6, 4తో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనికేత వేసిన ఐదో ఓవర్‌లోనూ సునీల్ 4, 4, 4, 6, 4తో 15 బంతుల్లోనే ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (19 బంతుల్లో 50) రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. అలాగే 2014లో కేకేఆర్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ (15 బంతు ల్లో 50) రికార్డును సమం చేశాడు. చివరికి అనికేత బౌలింగ్‌లో నరైన్ అవుటయ్యాడు. ఇక 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లిన్‌ను నేగి వెనక్కి పంపాడు. తర్వాత గ్రాండ్‌హోమ్ (31), గంభీర్ (14) 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ముగించారు.
తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. టాపార్డర్‌లో క్రిస్ గేల్ (0), విరాట్ కోహ్లీ (5) ఏబీ డివిల్లీర్స్ (10) విఫలమైనా.. ట్రెవిస్ హెడ్ (47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 నాటౌట్), మన్‌దీప్ సింగ్ (43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 52) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నరైన్, లిన్ ప్రదర్శనతో.. కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి మరో 29 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌లో ఎనిమిదో విజయంతో నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
http://www.hotstar.com/2001903192