రాష్ట్రాలపై కేంద్రం వివక్షను నిరసిస్తూ ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి. దేశం కేంద్రం అబ్బ సొత్తు కాదని చాటాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో సత్తా చాటేందుకు ప్రతి రాష్ట్రం కేసీఆర్ పోరాటానికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
ఆదివారం బేగంపేటలోని ప్రగతి భవన్‌కి వచ్చిన నారాయణమూర్తి సీఎం కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని సాగనిచ్చేది లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ఇచ్చిన హామీకి ఎన్డీయే కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. వెంకన్న సాక్షిగా తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో ఇచ్చిన హామీని నరేంద్ర మోదీ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.
ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీసిన కేసీఆర్… పార్లమెంటులో ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతిచ్చిన ఎంపీ కవితకు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తాను కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. కాగా..ప్రత్యేక హోదా ఏపీకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కు అని కూడా పేర్కొన్నారు.