అశ్లీల నృత్యాల ఘటనపై లోకేశ్ సీరియస్

5
- Advertisement -

విజయనగరం జిల్లా కురుపాం మండలం నీలకంఠపురంలోని ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న అశ్లీల నృత్యాల ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఫేర్‌వెల్ పార్టీ పేరుతో విద్యార్థుల సమక్షంలో ట్రాన్స్‌జెండర్లతో అసభ్యకర నృత్యాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థలు విలువలు, క్రమశిక్షణను నేర్పాల్సిన చోట ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించారు.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా, ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాత్ర ఉన్న టీచర్లు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఆదేశించినట్లు సమాచారం.

విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలు నేర్చుకోవాల్సిన వయసులో ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం బాధాకరమని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరిస్తుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్

- Advertisement -