ఓ వైపు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి మరోవైపు వరుసగా పార్టీని వీడుతున్న నేతలతో టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించాలంటే ప్రక్షాళనే మేలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించడంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ని నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లు ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన లోకేశ్‌కు ఇప్పుడు పార్టీని గాడిన పెట్టే బాధ్యతలు అప్పజెప్పనున్నారట. ఇందులో భాగంగానే ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పాలనకుంటున్న చంద్రబాబు… పార్టీ నేతల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారట.
చంద్రబాబు నిర్ణయం కావడంతో పార్టీ నేతలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అందుకే కొద్దిరోజులగా రాజకీయాలపై యాక్టివ్‌గా స్పందిస్తున్న లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విత్తనాల కొరత, టీడీపీ కార్యకర్తలపై దాడులపై వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆధారాలతో సహా చెబుతూ జగన్‌ని ఇరుకున పెడుతున్నారు.
ఇక బీసీకి పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వడంతో మంచి సంకేతాలు వెళ్లడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉందని చంద్రబాబు మాస్టర్ ప్లాన్. మొత్తంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో అని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.