అష్టాచమ్మా, అలా మొదలైంది, ఈగ, ఏటో వెళ్ళిపోయింది మనసు, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలతో.. హీరోగా తనకంటూ మాస్ ఇమేజ్ తెచ్చుకుని తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని. సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చి హీరోగా సెటిల్ అయ్యాడు ఈ న్యాచురల్ స్టార్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తనకంటూ ఓ మంచి స్థానాన్ని, అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మొదటిసారిగా నాని వారసత్వ హీరోలపై స్పందించాడు.
నేను లోకల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని వారసత్వంపై పలు వ్యాఖ్యలు చేశాడు. సినిమా రంగంలో తనకంటూ గాడ్ ఫాదర్స్ లేకపోవడం, ఆ వారసత్వాన్ని కొనసాగించకపోవడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. ఎవరైనా తన వద్దకు వచ్చి ‘నేను మీ అభిమాని’ అని అంటే వెంటనే నమ్ముతానని, ఎందుకంటే.. ఆ వచ్చిన వ్యక్తి తన కుటుంబ నేపథ్యాన్ని కాకుండా, తనను చూసి మాత్రమే ఆ మాట చెప్పినట్టు అర్థం చేసుకుంటానని కామెంట్ చేశాడు.
అదేవిధంగా నేను లోకల్ సినిమాకు సంబంధించి షూటింగ్ లేటవడంపైనా నాని స్పందించాడు. కీర్తి సురేశ్ డేట్స్ లేకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యమైందని, చాలా సీన్లను రీ షూట్ చేశారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాని వెల్లడించాడు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందిన చిత్రం `నేను లోకల్`.ఈ సినిమాకు సెన్సార్ పూర్తయై యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఫిబ్రవరి 3వ తేదిన నేను లోకల్ రిలీజ్‌కానుంది. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీప్రసాద్ సమకూర్చాడు.