నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు…

151
SPY Reddy

నంద్యాల ఎంపీ, జనసేన పార్టీ సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సుమారు 26 రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. ఎస్పివై రెడ్డి మరణవార్తతో నంద్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ నుంచి నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేశారు.

2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి నంద్యాల సీటు ఇవ్వకపోవడంతో ఆయన చివరకు జనసేనలో చేరారు. మూడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవ చేస్తున్నారు ఎస్పివై రెడ్డి. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన నంద్యాల పరిసర ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించారు. ఎంపీగా ఎన్నిక కాకముందు నుంచే ఎస్పీవై రెడ్డి అందరికి సుపరిచితులు. ఇక ఎస్పీవై రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.

ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు చంద్రబాబు. జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి మరణం చాలా బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ, కార్యకర్తల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎస్పీవై రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్‌.