టీఆర్ఎస్‌లోకి నామా..!

250
trs nama
- Advertisement -

లోక్ సభ ఎన్నికలకు సైరన్ మోగిన వేళ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నాయి. కొన్నిసీట్లలో అధికార టీఆర్ఎస్ సిట్టింగ్‌లకే జై కొట్టగా మరికొన్ని చోట్ల సిట్టింగ్‌లకు మొండిచూపనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇటు టీఆర్ఎస్,అటు కాంగ్రెస్‌కు హాట్ సీట్‌గా మారింది ఖమ్మం. ఇక్కడి నుండి పోటీచేసుందుకు ఈ రెండు పార్టీల నుండి పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీగా మరోసారి బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు నామా నాగేశ్వరరావు. టీటీడీపీలో కీలకనేతగా,చంద్రబాబు సన్నిహితుడిగా ఉన్న నామా టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమైన నామా ఖమ్మం లేదా మల్కాజిగిరి టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం. తనకు ఈ రెండు స్ధానాల్లో ఎక్కడి నుండి అవకాశం కల్పించినా తప్పకుండా గెలుస్తానని చెప్పారట. అయితే నామా ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు వివరించారట కేటీఆర్‌. అన్నిఅనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ మాజీ ఎంపీ టీఆర్ఎస్‌లో చేరడం ఎంపీగా పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా బరిలో దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి…టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లారు. పారిశ్రామికవేత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పొంగులేటి, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఆయనకు టికెట్ దక్కదనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా పొంగులేటికి సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌ నుండి టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

- Advertisement -