‘టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు… ఇది తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బ్లాక్ మెయిలర్ అని ముద్ర వేస్తాడ’ని ఆయనపై ఫిర్యాదు చేసిన బాధితురాలు సుజాత మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్‌కు చెందిన సుంకర సుజాత అనే మహిళను బెదిరించినట్లు నామాపై ఆరోపణలు ఉన్నాయి. నగ్నచిత్రాలు ఉన్నాయి బయటపెడతానంటూ తనను మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బెదిరించాడంటూ బాధిత మహిళ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహిళతో నామా చేసిన ఫోన్ సంభాషణ ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ సంభాషణలో మహిళతో నామా తీవ్ర ఆగ్రహంతో సంభాషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఈ విషయానికి సంబంధించి బాధిత మహిళ తన ఫేస్‌బుక్‌లోనూ పోస్టు చేసింది. నామా, అతని సోదరుడి నుంచి తీవ్రమైన బెదిరింపులను ఎదుర్కుంటున్నట్లు అందులో పేర్కొంది.
నామాకు కర్ణాటకలోని మహిళా ఎమ్మెల్సీతో సంబంధం ఉన్నట్లుగా మహిళతో ఫోన్ సంభాషణ ఆధారంగా తెలుస్తోంది. దీనిపై బాధిత మహిళ మాట్లాడగా ఆమెను నామా బెదిరించినట్లుగా ఆడియో టేపులో ఉంది. ఆమెతో గడుపుతుండగా తన వద్ద ఎందుకు వచ్చావని ప్రశ్నించగా ఆ విషయాలు నీకెందుకని, మరోసారి దీనిపై చర్చిస్తే చంపేస్తానని బెదిరించినట్లు మహిళ పేర్కొంది. అలాగే తన ఫోటోలను బయటపెడతానని నామా బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఈ విషయంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయగా న్యాయనిపుణుల అభిప్రాయం కోసం పంపగా న్యాయశాఖ నుంచి క్లియర్స్ రావడంతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.
నామాతో పాటు ఆయన సోదరుడు తన ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్కిటెక్చర్ అయిన సుజాత.. కుటుంబసభ్యుల అనుమతితోనే ఫిర్యాదు చేసినట్లు ఫేస్‌బుక్ పోస్టింగ్‌లో తెలిపింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు నామా నాగేశ్వరరావు ఆయన సోదరుడు సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.