`హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొన్న ఒక యోధుడి కోడుకుగా చిన్నప్పటి నుంచి నాటి గాధలను వినడంతో పాటు, అనేక బ్రతుకు చిత్రాలను ప్రత్యక్షంగా చూశాను. రజాకార్లు చేసిన దౌర్జన్యాలను, జ్యూస్రిపై నాజీలు చేసిన దౌర్జాన్యాలు కంటే ఎక్కువే. అందులో భాగమే ఈ సినిమా కథ` అన్నారు దర్శకుడు రాజు దుర్గే. ఆయన దర్శకత్వంలో సిద్ధార్ధ జాదవ్, జ్యోతి సుభాష్, జాకీర్ హుస్సేన్ నటీనటులుగా తెరకెక్కిన చిత్రం `నైజాం సర్కరోడా`. మౌళి ఫిలింస్ పై రత్నం ధవిజి సమర్పణలో రాజమౌళి నిర్మించారు. ఈ సినిమా ప్రివ్యూ షో మంగళవారం హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ షోను ప్రజాగాయకుడు గద్దర్ తో పాటు, పలువురు తెలంగాణ రాష్ర్ట ప్రముఖులు వీక్షించారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ , `సినిమా రంగం చాలా గొప్పది. మనసులో భావాలను..ఆవేదనలను దృశ్య రూపంలో ఇక్కడే మలచగలం. సామాన్య ప్రజలపై రజాకార్లు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారన్న అంశాన్ని సినిమా లో చక్కగా చూపించారు. ఆయుధాలతో పోరాటం చేసే వారిని నిరాయాధులు ఎలా ఎదుర్కున్నారు? ఎదుర్కోవాలంటే చేతిలో ఆయుధమే ఉండాలా? మన లో శక్తి సామార్ధ్యాలనే ఎందుకు ఆయుధంగా మలుచుకోకూడదు అనే అంశం బాగుంది. ఆ పాత్రల్లో నటించిన నటీనటుల ఆహార్యాలు.. నటన అద్భుతంగా ఉంది. ఇలాంటి చిత్రాలను ప్రజలంతా ఆదరించాలి. అప్పుడే ఇలాంటి కథలు మరిన్ని రావడానికి అవకాశం ఉంది` అన్నారు.
చిత్ర నిర్మాత రాజమౌళి మాట్లాడుతూ, ` భారతదేశ చరిత్రలో హైదరాబాద్ విముక్తి పోరాటం ఒక గొప్ప అధ్యాయం అయితే..అందులో సామాన్యుడు ఎదుర్కున్న విచిత్ర పరిస్థితులను దేశ చరిత్రలోనే మరొక అధ్యాయంగా భావించవచ్చు. ఇందులో ఉన్న నాటి పరిస్థితులను, సంస్కృతి, భాష, పోరాట తీరు, హాస్యం ఈ సినిమా చేయడానికి ప్రేరణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులంతా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు.
ప్రోఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, `రజాకార్ల చేతిలో అప్పటి ప్రజలు ఎలా నలిగిపోయారు? ఎన్ని అవస్థులు పడ్డారు. వారిపై తిరగబడి ఎలా నిలబడ్డారనే అంశాలు వాస్తవికంగా చక్కగా తీశారు. టెక్నికల్ గా సినిమా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి` అని అన్నారు.
అలాగే షో ను వీక్షించిన తెలంగాణ ప్రముఖులు విట్టల్, చంద్రన్న, రవీంద్ర చారి, శ్రీనివాస్, శుగరబేగం తదితరులు సినిమా బాగుందని, ఇలాంటి కథలున్న సినిమాలను ప్రేక్షకులంతా ఆదరించాలని కోరారు.