నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీఆర్ఎస్. సిట్టింగ్ స్ధానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వనున్నారు. నేడో, రేపో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించనుండగా ఇప్పటికే కదనరంగంలో దూసుకుపోతున్నారు గులాబీ శ్రేణులు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత జానారెడ్డి గెలుపొందగా, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నర్సింహయ్య చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో నోముల కుమారుడు భగత్‌కు టికెట్ ఇవ్వాలా లేక వేరేవారికి ఇవ్వాలా అన్నదానిపై సీఎం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.
బీసీ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటిస్తే ఆ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే కానుంది. బీసీ సంఘాల్లోని ప్రముఖలు, గ్రామాల్లోని కులపెద్దలు మరోసారి టీఆర్‌ఎస్ నిలబెట్టే బీసీ అభ్యర్థినే గెలిపించుకొంటామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాలు పూర్తిగా, మాడ్గులపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఒక త్రిపురారం మండలంలోనే 235 ఓట్లు కాంగ్రెస్‌కు అధికంగా వచ్చాయి. మిగతా మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హాలియా, నందికొండ మున్సిపాలిటీలను ఏకపక్షంగా గెలిచింది.
ప్రధానంగా పోరు కాంగ్రెస్ – బీజేపీ మధ్య మాత్రమే ఉండగా గత ఎన్నికల్లో 2,675 ఓట్లను మాత్రమే సాధించి నాలుగో స్థానానికి పరిమితమైన బీజేపీ.. కనీసం పోటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.