తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడవ విడత హరితహార కార్యక్రమం మండలంలో ఉద్యమంలా సాగుతోంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, సినీ రంగ ప్రముఖులు,వారి అభిమానులు హరితహారం కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు వారివారి నియెజకవర్గాల్లో,మండల కేంద్రాల్లో అధికారులు, గ్రామాల్లో సర్పంచులు, అన్ని పార్టీల కార్యకర్తలు జాతరలా కదిలి హరిత ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ముమ్మరంగా సాగుతున్న హరితహారం కార్యక్రమానికి సంబంధించి తన అభిమానులు మొక్కలు నాటుతున్న ఫోటోలను హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫోటోలు పెడుతూ, వాటిని ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. పర్యావరణం కోసం తన అభిమానులు తమవంతు సాయం చేస్తున్నారని, ఇందుకు తనకెంతో గర్వంగా ఉందని నాగార్జున చెప్పారు. అభిమానులు విద్యార్థులకు మొక్కలు పంచుతున్న దృశ్యాలను, ఆపై మొక్కలు నాటుతున్న దృశ్యాలను నాగ్ ట్విట్టర్ లో ఉంచారు.
Proud of my fans doing their bit for the envoirment👏#harithaharam @KTRTRS pic.twitter.com/FoquQXdDQo
— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 12, 2017