నగరం: రివ్యూ

311
Nagaram Telugu Movie Review
- Advertisement -

ఈ మధ్య కాలంలో యంగ్ హీరో సందీప్ కిషన్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత సందీప్ మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. అయితే ఈసారి ఆయన తమిళంలో నటించిన ‘మానగరం’ సినిమాను తెలుగులో ‘నగరం’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రివ్యూ షోను బుధవారం ప్రదర్శించారు. మరి ఈ రోజు విడుదలైన ‘నగరం’ ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం.!

కథ:

ఈ సినిమా కథ ఇదీ… అని నిర్దిష్టంగా చెప్పలేం. ఎందుకంటే..సొంత వూరు నుంచి ఉద్యోగం కోసం వచ్చిన ఓ యువకుడు, తన వూళ్లొనే ఉంటూ.. చిన్నప్పటి నుంచీ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్న మరో కుర్రాడు, పిల్లాడి ఆపరేషన్‌ కోసం నగరం వచ్చి, ఇక్కడ ఓ టాక్సీ నడుపుకొంటూ కడుపునింపుకోవాలని చూసే ఓ సగటు జీవి, డాన్‌ అయిపోదామని ఓ కిడ్నాప్‌ ముఠాతో చేతులు కలిపిన ఓ అమాయక జీవి… ఈ నలుగురి చుట్టూ సాగే కథే ఈ ‘నగరం’. వాళ్లు చేసిన చిన్న చిన్న తప్పిదాలే వాళ్లని పెను ప్రమాదంలో పడేస్తాయి. మరి ఆ తప్పులేంటి? అందులోంచి ఎలా బయటపడ్డారు? అనేదే ‘నగరం’ కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే చెప్పుకోవలసింది ఆరంభం నుండి చివరి వరకు కొనసాగించబడిన సస్పెన్స్. దీని వలన తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో అనే ఉత్సుకత కొనసాగింపబడి ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. జావేద్ అందించిన సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. తన సౌండ్స్‌తో, సైలెన్స్‌తో సినిమా స్థాయిని పెంచాడు. దర్శకుడు లోకేష్ తను రాసుకున్న మంచి స్క్రీన్ ప్లేని అద్భుతంగా తెరపై ఆవిష్కరించి కాస్త సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా వివరించాడు.  సాంకేతికంగా చూస్తే దర్శకుడికి ఎక్కువ మార్కులు పడతాయి. తాను కథని, సన్నివేశాల్ని చాలా జాగ్రత్తగా రాసుకొన్నాడు. ఏ క్యారెక్టర్‌నీ తక్కువ చేయలేదు. దేన్నీ అనవసరంగా పెంచలేదు. ఛాయాగ్రహణం సినిమా మూడ్‌కి తగ్గట్టు సాగింది. ఇలాంటి సినిమాల్ని ఎడిట్‌ చేయడం చాలా కష్టం. అందులో ఎడిటర్‌ నేర్పు కనిపించింది.

సందీప్ కిషన్ కూడా హీరో ఇమేజ్ ను వదిలేసి ఒక నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. సందీప్‌ కిషన్‌, శ్రీ.. వీరిద్దరిలో ఎవ్వరూ హీరోలు కాదు. కథే ఇక్కడ హీరో. మొదటి భాగం మొత్తాన్ని మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. చిన్న చిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. అలాగే చెన్నై లాంటి మహా నగరంలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్ గా చూపడం బాగుంది.
 Nagaram Telugu Movie Review

మైనస్ పాయింట్స్ :

హీరోయిన్ రెజినాకు కథలో అంతగా ప్రాధాన్యం లేదు. సినిమా కథనం బాగానే ఉన్న ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడానికి, కథనంలో కుదురుకునేలా చేయడానికి దర్శకుడు మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఇలాంటి వేగవంతమైన కథనం ఉన్న సినిమాల్లో సన్నివేశాలు కూడా వేగంగానే ఉండాలి. కానీ ఇందులో కాస్త సాగదీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి కథనం యొక్క వేగాన్ని కాస్త దెబ్బతీశాయి. అలాగే ఫస్టాఫ్ బాగున్నా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు తోచింది. చివరగా సినిమా ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కథ కొన్ని చోట్ల రిపీట్ అవుతున్నట్టు తోచింది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో సాంకేతిక విభాగం పని తీరు గొప్పగానే ఉంది. ముఖ్యంగా సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. చెన్నై మహా నగరాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా తగిన విధంగా ఉంది. సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలు థ్రిల్స్ ని కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రభావవంతంగా చూపించారు. దర్శకుడు లోకేష్ రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు. నాలుగు విడివిడి కథలను ఒకటిగా కలుపతూ సినిమాను నడపడంలో, నటీ నటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథనంలోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా వివరించాడు.

తీర్పు :

ఈ ‘నగరం’ చిత్రం హీరో సందీప్ కిషన్ కు తప్పక విజయాన్నందిస్తుందని చెప్పొచ్చు. నటీనటుల నటన, కట్టిపడేసే కథ కథనాలు, వాస్తవికతకు దగ్గరగా ఉండే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్. మొత్తం మీద కథనంలో కాస్త నెమ్మదితనాన్ని, రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో పెద్దగా లేకపోవడాన్ని పట్టించుకోకపోతే ఈ ‘నగరం’ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి మంచి చాయిస్ అవుతుంది.

విడుదల తేదీ:10/03/2017
రేటింగ్ : 3/5
నటీనటులు: సందీప్‌కిషన్‌, రెజీనా, శ్రీ, చార్లీ, రాందాస్‌, మధుసూదన్‌ తదితరులు
సంగీతం: జావేద్‌ రియాజ్‌
నిర్మాత: ఏకేఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రొటన్షియల్‌ స్డూడియోస్‌
దర్శకుడు: లోకేష్‌ కనగరాజ్‌

- Advertisement -