నాగకన్యలో ఆ నలభై నిమిషాలు ఎంతో ప్రత్యేకం..

327
- Advertisement -

గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. జర్నీ, రాజా రాణి చిత్రాల పేమ్ జై హీరోగా, వరలక్ష్మిశరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్ థెరిస్సా ప్రధాన పాత్రలలో ఎల్.సురేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఎంతోమంది నిర్మాతలు ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం పోటీపడగా వాటిని లైట్ హౌస్ సినీమ్యాజిక్ అధినేత కె.ఎస్.శంకర్ రావు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్.శంకర్ రావు మాట్లాడుతూ, వేసవి కానుకగా ఈ నెల 24న ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాము నేపథ్య కథాంశంతో వచ్చిన నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని…నేటి నవీన సాంకేతికతను మిళితం చేయడంతో పాటు ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్ ఈ చిత్రానికి ఓ హైలైట్ అవుతుంది. పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరింపజేసే ఈ గ్రాఫిక్స్ కోసం అధికంగా ఖర్చు అయినా… వాటికున్న ప్రాధాన్యం దృష్ట్యా రాజీపడలేదు. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు… మనిషి పాముగా మారే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటిని దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రసంశనీయం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోలకు మంచి స్పందన లభించింది అని చెప్పారు.

Nagakanya Movieదర్శకుడు ఎల్.సురేష్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నిజ కోబ్రాను వాడాలని అనుకున్నాం. అందుకోసం బ్యాంకాక్ కూడా వెళ్లాం కానీ ఒరిజనల్ పామును షూటింగ్‌లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో కింగ్ కోబ్రాను గ్రాఫిక్స్ లో చూపించాం అని అన్నారు.

గ్రాఫిక్స్ నిపుణుడు వెంకటేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం బుల్లితెరపై పాము నేపథ్యంలో అనేక సీరియళ్లు ప్రసారమవుతున్నాయి. వాటికి భిన్నంగా వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిసి అనేక విషయాలను చర్చించాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్ లో ఉపయోగించాం. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. శిక్షకుడు ఏం చెబితే అది వింటాయి. మూడు అడుగుల ఎత్తు లేచి బుసకొడతాయి. వీటన్నింటినీ గ్రాఫిక్స్ సాయంతో ఈ చిత్రంలో చూపించాం అని చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో బాలశరవణన్, అవినాష్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ-రాజావెల్ మోహన్, సంగీతం-షబీర్, ఎడిటింగ్-గోపీకృష్ణ, ఫైట్స్-జి.ఎన్.మురుగన్.

- Advertisement -