30 వేల మంది ఓటర్లు మిస్సింగ్
మునుగోడులో పార్టీలకు కొత్త టెన్షన్
వలస వెళ్ళిన ఓటర్ల కోసం పార్టీల వేట
వలస ఓటర్లకు భారీ ఆఫర్లు ?
భాగ్యనగరంలో మునుగోడు ఓటర్లు
ముంబాయిలోనూ ఓటర్ల కోసం వేట
వలస వెళ్ళిన ఓటర్లపై బిజెపి టెన్షన్
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకు సరికొత్త టెన్షన్ మొదలయ్యింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 30 వేల మంది ఓటర్లు కనిపించడం లేదు. దీంతో ప్రధాన పార్టీలకు షాక్ కొట్టినట్లయ్యింది. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి కూడా ఓటర్లు భౌతికంగా మునుగోడు నియోజకవర్గంలో లేకపోవడంతో వారి కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు పార్టీల నేతలు. అసలే ఒక్కొక్క ఓటును కూడా వదిలిపెట్టకుండా…. ప్రతి ఓటునూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్న పార్టీలకు ఏకంగా 30 వేల మంది ఓటర్లు కనిపించకపోవడంతో ప్రధాన పార్టీల నేతలు నరాలు తెగే టెన్షన్‌కు లోనై వారి కోసం వెతుకులాట మొదలు పెట్టారు. మనుగోడులో ఎలాగైనా గెలవాలని, గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పార్టీలు వలస వెళ్ళిన ఓటర్ల కోసం గాలింపులు మొదలుపెట్టాయి. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా 30 వేల వరకూ ఓటర్లు వివిధ ప్రాంతాలకు వలసవెళ్ళారని తెలియడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఖంగుతిన్నారు.
ఇప్పుడు వలసవెళ్ళిన ఓటర్లను తిరిగి మునుగోడు నియోజకవర్గానికి రప్పించడానికి ప్రధాన పార్టీల నాయకులు భారీగా కసరత్తులు చేస్తున్నారు. వలస వెళ్ళిన ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? వారి సెల్ ఫోన్ నెంబర్లు సేకరించడం, వలస ఓటర్ల కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు చేయించి భారీగా తాయిలాలు ముట్టజెబుతామంటూ ఆశ చూపుతున్నారని తెలిసింది. హైదరాబాద్ లోని ఎల్.బి నగర్, దిల్ షుక్ నగర్, కూకట్ పల్లి, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారని పార్టీల నేతలు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరికొంతమంది ముంబాయి, షోలాపూర్ వంటి నగరాలకు కూడా వలస వెళ్ళారని టి.ఆర్.ఎస్, కాంగ్రెస్, బి.జె.పి.పార్టీల నేతలు కొందరు తెలిపారు. ఓటర్ల జాబితాను తీసుకొని పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్లు ఎంత మంది ఉన్నారు, వారంతా ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నారా? లేదా? అని ఆరా తీసే పనిలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్, బి.జె.పి.పార్టీల నాయకులు బూత్ లెవెల్ కార్యకర్తలను పురమాయించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓటర్ల జాబితాను చేతబుచ్చుకొని పార్టీలన్నీ ఇంటింటి సర్వే చేస్తున్నాయని కొందరు అధికారులు సైతం చెబుతున్నారు.
ముఖ్యంగా వలసవెళ్ళిన ఓటర్లలో బి.జె.పి.కి చెందిన ఓటర్లే అధికంగా ఉన్నారని, అందుకే బి.జె.పి.నేతలు అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారని ఆ అధికారులు వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్ళిన వారిని రప్పించాలని వారి వారి కుటుంబ సభ్యులను కోరుతున్నారని, ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఆయా పార్టీల బూత్ కమిటీల కార్యకర్తలు, నాయకులు ఓటర్ల జాబితాలు చేతబుచ్చుకొని ఓటర్ల కోసం వెదుకులాటలు ప్రారంభించారని తెలిపారు. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న నాయకులకు వలస వెళ్ళిన కుటుంబ సభ్యుల గురించి సమాచారం కూడా లభిస్తోందని వివరించారు. టి.ఆర్.ఎస్.పార్టీకి చెందిన ఓటర్లు కూడా హైదరాబాద్ నగరంలో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సమాచారం లభించడంతో వారు కూడా తమతమ ఓటర్లను గ్రామాలకు రప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం వలస వెళ్ళిన సుమారు 30 వేల మంది ఓటర్లలో ఎక్కువ మంది భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారని, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, ఇతర ప్రైవేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారే అధికంగా ఉన్నారని, వారి వారి కుటుంబ సభ్యుల నుంచి వలస వెళ్ళిన వారి సెల్ ఫోన్ నెంబర్లను సేకరించి వారిని తిరిగి గ్రామాలకు రప్పించే పనిలో ఆయా పార్టీల నాయకులు తల మునకలయ్యారు. నలుగురు, అయిదుగురు ఓటర్లను ఒక జట్టుగా చేసి వారి కోసం ప్రత్యేకంగా కార్లను ఏర్పాటు చేసి ఓటు వేయించి తిరిగి వారిని మళ్ళీ హైదరాబాదు , ఇతర ప్రాంతాలకు వదిలిపెట్టేందుకు ఆయా పార్టీల నాయకులు తగిన రవాణా సదుపాయాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నాయని వివరించారు.
భారీగా నగదు, ఇతర బహుమతులను కూడా వలస వెళ్ళిన ఓటర్లకు ముట్టజెప్పేందుకు కూడా సిద్ధమైనట్లు తెలిసింది. వలస వెళ్ళిన ఓటర్లలో కూలీలు ఉంటే వారు పట్నంలో (హైదరాబాద్) రోజుకు ఎంత సంపాదిస్తున్నారో… అంతకంటే రెట్టింపు డబ్బును ఇస్తామని, గ్రామానికి వచ్చినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకూ అతని రోజు వారీ కూలీని (రెట్టింపు డబ్బు) లెక్కించి ఇచ్చేందుకు కూడా నేతలు ఓటర్లకు నచ్చజెపుతున్నారని, ఈ నెల 31వ తేదీకల్లా వలస వెళ్ళిన కూలీలందరూ తమతమ గ్రామాలు, చౌటుప్పల్, మునుగోడు పట్టణాలను చేరుకునేలా ప్రధాన పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, నాయకులు పక్కా ప్రణాళితో పనిచేస్తున్నారని వివరించారు. ఇక ముంబాయి, షోలాపూర్ వంటి నగరాలకు వలస వెళ్ళిన ఓటర్లకు రానూపోనూ చార్జీలు ఇవ్వడమే కాకుండా రోజుకు ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు కూడా ఆయా పార్టీల నేతలు సిద్ధమయ్యారని వివరించారు. ఏది ఏమైనప్పటికీ మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లోని ఓటర్లకు మహర్దశ పట్టుకుందని, దాదాపు అన్ని పార్టీల నాయకులు ఓటర్లను “ముఖ్య అతిధు”లుగా మాదిరిగా చూస్తున్నారని, మునుగోడులో ఓటు హక్కు ఉంటే దశ తిరిగినట్లుగానే
ఓటర్లు భావిస్తున్నారని, నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి దావట్లు భారీగా జరుగుతున్నాయని, ఎక్కడికి వెళ్ళినా మసాలా గుబాళింపులు వస్తున్నాయని వివరించారు. ఇలా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లోని సుమారు 2.49 లక్షల ఓటర్లలో ఏ ఒక్కరినీ ఒక్క పార్టీ నేతలు విస్మరించేటట్లు లేరని, ఒక్కోక్క ఓటరు ఒక్కో యూనిట్ గా పరిగణించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు అష్టకష్టాలు పడుతున్నారని అంటున్నారు.